ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ (ఎడారిలో ఏర్పడే జలాశయము) దెగ్గిర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి, ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు.
ఎడారిలో పగటి పూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది.
ఆ చలిలో వొణుకుతు షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు.
బయట వున్న ఒంటేకి చాలా చలి వేసింది. చివరికి డేరా లో ముక్కు దూర్చి, “షేకు, ఇవాళ చాలా చల్లగా వుంది, నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను నా ముక్కు మట్టుకు పెట్టుకుంటాను” అని దీనంగా అడిగింది.
షేకు కి జాలి వేసింది. అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు.
కొంత సేపటికి ఒంటె షేకుని మళ్ళి నిద్ర లేపింది. ముక్కోకటే పెట్టుకుంటే చలికి ఆగట్లేదని, అలాగే తల దాచుకోవడానికి చోటు ఇవ్వమని అడిగింది. షేకు ఒప్పుకున్నాడు.
తల పెట్టు కున్నాక కొంత సేపటికి ఒంటె షేకు ని మళ్ళి నిద్ర లేపి, తల దాచుకున్నాక మెడకు మట్టుకు యెంత స్థలం కావాలి, మెడ కూడా పెట్టుకొనా అని అడిగింది. షేకు మళ్ళి ఒప్పుకున్నాడు.
అక్కడతో ఆగిందా? ఇలా కొంచం కొంచం దేరలోకి దూరి, ముందు కాళ్ళు, వొళ్ళు, తోక కూడా దేరలోకి దూర్చింది.
ఒక్క మనిషి కోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఒంటె ఎలా పడుతుంది? కొంచం కొంచంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేకుని డేరా బయటికి తోసేసింది. ఆ షేకు యెంత ప్రయత్నించినా కొంత చోటు కూడా ఇవ్వలేదు. అసలు ఆ షేకుని మళ్ళీ దేరలోకి కాలు పెట్టనివ్వలేదు.
పాపము, ఆ షేకు ఒంటెకు మంచి చేయబోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది.
మన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదటిలో ఇది చిన్న విషయమే కదా, మనం కంట్రోల్ చేయచ్చు అనిపిస్తుంది, కానీ ఆ అలవాటు మనకి తెలీకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించు కుంటుంది. మొదటిలో అలవాటే, కాని రాను రాను గ్రహపాటు అవుతుంది. అందుకే చిన్నదే అయినా సరే, దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు.